వరద బాధితులను ఆదుకొనేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపును భారీ స్పందన లభిస్తోంది. దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, సినీ ప్రముఖులు, వైద్యులు, ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు సహా పలు రంగాల వారి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎంఎఫ్ఆర్) విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌కు స్టేట్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్.. డిప్యూటీ సీఎం భట్టి, పలువురు బ్యాంకు ఉద్యోగులతో కలిసి అందించారు.
అలాగే, అరబిందో ఫార్మా సైతం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించింది. సంబంధిత చెక్కును కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌కు అందించారు. వీరితో పాటు ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి తమ ఆస్పత్రి తరఫున రూ.కోటి విరాళం అందించారు.