మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన బాలకృష్ణారెడ్డి
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తారు.
ఉద్యమకారుడిగా గుర్తింపు..
తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి గుర్తింపు ఉంది. బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు.
2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి.. వైసీపీలో చేరారు. అయితే లోక్‌సభలో వైఎస్ జగన్ తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో అక్కడి నుంచి కూడా బయటపడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని నెలకొల్పి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పాల్గొన్నారు. తీరా పార్టీని ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్రంలో అధ్యక్షుని మార్పు జరిగాక జిట్టాను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నెల రోజులు కూడా గడువక ముందే గతేడాది అక్టోబర్ 20న బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో 14 ఏండ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఇంతలోనే అనారోగ్యం బారినపడిన ఆయన హఠాన్మరణం చెందారు.