AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం తీపికబురు.. త్వరలోనే మరో డీఎస్సీ..

తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపికబురు వినిపించారు. ఇప్పటికే 11 వేల 62 పోస్టులతో డీఎస్సీ పరీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి సర్కార్.. త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క.. కీలక ప్రకటన చేశారు. త్వరలో.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. రాష్ట్రంలో 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. 45 వేల మంది టీచర్లను ట్రాన్స్‌ఫర్ చేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో మొదట ఉపాధ్యాయులకే ప్రాధాన్యం ఇచ్చామని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. విద్యావ్యవస్థలో ఏ మార్పులు వచ్చినా మొదట స్వాగతించేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అభ్యుదయభావంతో ఆలోచించినప్పుడే.. సమాజం మెరుగైన మార్గంలో పయణిస్తుందని వివరించారు. ఈ క్రమంలోనే.. తెలంగాణలో విద్యావ్యవస్థపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకొచ్చారు.

తెలంగాణలోని అమ్మ ఆదర్శ పాఠశాలలకు 667 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ క్రమంలోనే.. విద్యార్థులకు మెరుగైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు భట్టి వివరించారు. ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన సిలబస్‌ను.. ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తలతో కూడిన సమన్వయ కమిటీ ద్వారా తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ANN TOP 10