భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు కూబింగ్ చేపట్టగా… మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలిసింది. లచ్చన్న సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందింది. అయితే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల ఛత్తీస్‌ఘడ్ దంతెవాడలోనూ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో మెుత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టుుల మృతి చెందారు. ఇది మావోయిస్టులకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. కాగా, తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు అంతగా లేవనే చెప్పొచ్చు. పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేయటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్‌కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు హతం కాలేదు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలను అలర్ట్ చేశారు.