హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రా . ఈ పేరు వినగానే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు నిర్మించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇళ్లు కూల్చేస్తుందో అని భయం భయంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసినట్లు ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అడ్డాలో ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల గురించి ఆరా తీశారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్‌హౌస్‌కు అనుమతులు లేవని గుర్తించారు. అంతేకాకుండా అంబేడ్కర్ నగర్‌లోని ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డు సమీపంలోని నాలా ఆక్రమణకు గురైనట్టు హైడ్రా అధికారులు తేల్చారు. ఇక ఫామ్‌హౌస్‌కు అనుమతులు జారీ చేసిన అధికారులపై.. చెరువు ఆక్రమణలపై అలసత్వం ప్రదర్శించిన అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్టు ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.