ఆంధ్రప్రదేశ్‌లో ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాది మంది నగర జీవులు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో చేపట్టిన చర్యలు మంచివేనని తెలిపారు. భవనాలు నిర్మించిన అనంతరం కూల గొట్టడం ద్వారా ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.
బుడమేరు వాగును శాటిలైట్ ద్వారా పరిశీలించి.. అవసరమైన చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. అందుకు హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అయితే ఇదే అన్నింటికి పరిష్కారం కాదన్నారు. అదే సమయంలో పేదలను సైతం దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనం నిబంధనలు విధించి.. వాటిని పటిష్ఠంగా అమలు చేయాల్సిన బాధ్యత సైతం మనపై ఉందన్న విషయాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు. ఆ క్రమంలో నదులు, చెరువులు, కాలువలు ఆక్రమణకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
లే అవుట్ల అనుమతి సమయంలో అన్నీ పరిశీలించి.. ఆ తర్వాతే అనుమతులు జారీ చేయాలన్నారు. స్థానిక రాజకీయ నేతలు సైతం ఆక్రమణలు ప్రోత్సహించ కూడదని తెలిపారు. మరో పది, పదిహేనేళ్లకు మరో ప్రభుత్వం వచ్చినా ఇలా ఉండాలని తెలిపారు.