ఆదిలాబాద్‌లో పర్యటన
పెన్‌గంగ వంతెన సందర్శన
మంత్రి వెంట అసెంబ్లీ ఇన్చార్జిలు కంది శ్రీనివాసరెడ్డి, శ్రీహరిరావు
(అమ్మన్యూస్, ఆదిలాబాద్):
ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున గల పెన్ గంగా బ్రిడ్జిని సందర్శించారు. నదిలో వరద పరిస్థితిని గమనించి జిల్లా అధికార యంత్రాగానికి తగు సూచనలు చేసారు.రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతోందని తెలిపారు.ఇందులో భాగంగానే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మహబూబాబాద్ పర్యటనలో బిజీగా ఉండడంతో ఇక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు తాను వచ్చానని తెలిపారు. వానలు వరదల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల ప్రాణాలతోపాటు ఆస్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా వర్షాలు తగ్గు ముఖం పట్టిన తర్వాత పంట నష్టంపై సర్వే చేసి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించే విధంగా ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుందన్నారు. పెన్‌గంగా బ్రిడ్జిని సందర్శించి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుపై తన కోసం ఎదురుచూస్తున్న కామాయి, మాండగడ గ్రామస్తులను కలిసి మంత్రి మార్గమధ్యలో మాట్లాడారు. గ్రామస్తులు తమకు రోడ్డు సౌకర్యం కావాలని, వరదలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సీసీఐ, ఐటీ టవర్ సందర్శన
భారీ పరిశ్రమలు, ఐటీశాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ,నిర్మల్ అసెంబ్లీ ఇంఛార్జులు కంది శ్రీనివాస రెడ్డి , శ్రీహరిరావులతో కలిసి స్థానికంగా మూతపడిన సీసీఐ పరిశ్రమను సందర్శించారు. ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు. జీఎం మాట్లాడి ప్రస్తుత పరిస్థితి, ఇతరాత్ర వివరాలు ఆరాతీశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇదే విషయమై కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామితో కూడా మాట్లాడినట్టు వెల్లడించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పరిశ్రమను పున: ప్రారంభించేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామన్నారు. ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ముందుకుసాగుతామని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధికి చెందినది కాబట్టి పురుద్ధరణకు రాష్ట్రం తరపున కావలసిన సహకారమందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం మావల పరిధిలోని హైవే పక్కన గల ఐటి టవర్ ను సందర్శించారు. ఇంజనీర్ ను అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని సూచించారు. వచ్చే జనవరి మాసంకల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.