గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు గులాంగిరి చేసిందని మండిపాటు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవటం అభినందనీయమని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని ఎమ్మెల్యే తెలిపారు. వేల మంది యువత మద్దతు ఉందని అక్బరుద్దీన్ బెదిరిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరి భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళాలని సూచించారు.
ఓవైసీ బ్రదర్స్‌ను బొక్కలో వేసిన సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరుందని గుర్తుచేశారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. చెరువులో 12ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజ్‌ను నిర్మించారన్నారు. అసదుద్దీన్ ఓవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు గులాంగిరి చేసిందని విమర్శించారు. కలెక్టర్ సాయంతో గోషామహాల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు.
హాట్‌టాపిక్‌గా సల్కం చెరువు కబ్జా…
అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సల్కం చెరువు కబ్జా విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్.. ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన విద్యాసంస్థలను కూల్చుతుందా? లేదా? అనేది సస్పెన్స్‌ను తలపిస్తోంది. ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చాలంటూ హైడ్రాకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి. చెరువును మట్టితో పూడ్చేసి భారీ భవనాల నిర్మాణం గావించారు . 2016 – 2021 లో కబ్జాకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్∙కూల్చివేత అనంతరం ప్రముఖంగా వినిపిస్తున్న కబ్జాల్లో సల్కం చెరువు కబ్జా ఒకటి. పైగా అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో ఇది రాష్ట్రంలో మరింత హాట్ టాపిక్‌గా మారింది. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు.