AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిరూపిస్తే నేనే కూల్చేస్తా.. కేటీఆర్‌ తెలుసుకుని మాట్లాడాలి.. ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి ఫైర్‌

నేనేం చెరువును ఆక్రమించలేదు..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ప్రభుత్వ నిబంధనల మేరకే ఇల్లు కట్టుకున్నానని, నేనేం చెరువును ఆక్రమించలేదని, బీఆర్‌ఎస్‌ నేతలు తెలియక మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. హిమాయత్‌ సాగర్‌లో నిర్మించిన గెస్ట్‌ హౌస్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు అక్రమంగా నిర్మించారని చేస్తున్న ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువులను ఆక్రమించి చాలామంది నిర్మాణాలు చేపట్టారని, హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మంచిదేనని సమర్థించారు. నిబంధనల ప్రకారమే తన ఫౌంహౌస్‌ నిర్మించానని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తేలితే తానే కూల్చివేస్తానని స్పష్టం చేశారు. హైడ్రా నుంచి తమకు ఎటువంటి నోటీసులు అందలేదని, చెరువుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

నిబంధనల మేరకు…
‘కొత్వాల్‌గూడలో మా కుమారుడి 14 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. అది పట్టా భూమి, 1999లో కొన్నాం. నేను రాజకీయాల్లో ఉన్న కాబట్టి తప్పు చేయొదన్న ఉద్దేశంతో ఇరిగేషన్‌ శాఖ అధికారులను అడిగి నిబంధనల మేరకు అక్కడ ఫాంహౌస్‌ నిర్మించాం. 2005లో అనుమతి తీసుకుని, కలెక్టర్‌తో మాట్లాడాకే భవనం నిర్మించాం. నేను భవన నిర్మాణం చెరువులో చేశానని తేలితే చర్యలు తీసుకోండి. నేను కూడా పూర్తిగా సహకరిస్తాను. నేను తప్పు చేయలేదు.. ఒకవేళ తప్పని తేలితే నేనే కూల్చేస్తా’నని అన్నారు.

కబ్జా చేసే అవసరం నాకు లేదు..
నాకు అక్కడ భవనంలో ఉండాల్సిన అవసరం కూడా లేదని మహేందర్‌రెడ్డి అన్నారు. ‘మా తాత ఇచ్చిన భూములు మాకు చాలా ఉన్నాయి. చెరువును కబ్జా చేసే అవసరం నాకు లేదు. సీఎం రేవంత్‌ రెడ్డి చెరువులను కాపాడటానికి తీసుకుంటున్న చర్యలు బావున్నాయి. చెరువులను రక్షించే కార్యక్రమం చాలా మంచిది. హైడ్రా నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. మా భవనానికి ప్రత్యేకంగా రోడ్డు వేయించుకోలేదు.. రోడ్డు గ్రామ పంచాయతీ నిర్మించింది. 111 జీఓ పరిధిలో నా ఒక్కడిదే కాదు, వేల మంది భూములున్నాయి. నా ఫాంహౌస్‌ అక్రమంగా కట్టారని కేటీఆర్‌ చెప్పారు.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేటీఆర్‌ అయినా వచ్చి కూల్చేయవచ్చు. కేటీఆర్‌ తెలియక మాట్లాడి ఉంటార’ని మహేందర్‌ రెడ్డి అన్నారు.

ANN TOP 10