AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు నిందితుడికి.. ముగిసిన పాలిగ్రాఫ్ పరీక్ష

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ వైద్యురాలి హత్యాచార కేసు నిందితుడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష ముగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలుకు చేరుకున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్)కు చెందిన పాలిగ్రాఫ్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు లై-డిటెక్టర్ టెస్ట్‌ నిర్వహించారు. అయితే పాలిగ్రాఫ్‌ టెస్ట్‌కు ముందు తాను నిర్దోషినని జైలు అధికారులతో అతడు అన్నాడు. వైద్యురాలి హత్యాచారం గురించి తనకు తెలియదని, ఈ కేసులో తనను ఇరికించినట్లు సంజయ్ రాయ్‌ ఆరోపించాడు.

కాగా, ఈ కేసులో అరెస్టైన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌, ఆ రాత్రి వైద్యురాలితో కలిసి ఉన్న నలుగురు సహోద్యోగులకు కూడా శనివారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఆర్థిక అవకతవకలకు సంబంధించి కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, మాజీ ఎంఎస్‌వీపీ సంజయ్ వశిష్ఠ్‌, మరో 13 మంది నివాసాలలో సీబీఐ ఆదివారం సోదాలు నిర్వహించింది.పేషెంట్ కేర్ కోసం మెటీరియల్స్ సరఫరా చేసే వారి ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సీబీఐ అవినీతి నిరోధక విభాగం సోదాలు చేసింది.

మరోవైపు సందీప్ ఘోష్‌ను బెలియాఘటలోని ఆయన నివాసంలో సీబీఐ ప్రశ్నించింది. వశిష్ఠ్‌, ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్‌ను కూడా విచారించారు. హౌరాలోని ఒక సరఫరాదారు నివాసం, మాజీ ప్రిన్సిపాల్ కార్యాలయం, క్యాంటీన్‌తో సహా ఆసుపత్రి ప్రాంగణంలో కూడా సోదాలు చేశారు. సోదాల సందర్భంగా ప్రస్తుత ప్రిన్సిపాల్ మానస్ కుమార్ బందోపాధ్యాయ సహాయాన్ని సీబీఐ కోరింది.

ANN TOP 10