AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నగరంలో ఒలింపిక్స్‌.. 2036లో విశ్వ క్రీడలు నిర్వహిస్తాం..

అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పిస్తాం
సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
ఇదివరకే పీఎంకు విన్నవించామని వెల్లడి

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ గేమ్స్‌ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. 2036లో నిర్వహించేందుకు తమకు అవకాశం కల్పించాలని ఇదివరకే ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆదివారం ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ మారథాన్‌ విజేతలకు గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి బహుమతులు అందేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2036లో ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. విశ్వక్రీడలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో స్టేడియాలను నిర్మిస్తామని, వసతులు కల్పిస్తామని చెప్పానన్నారు. దానికోసం ఇప్పటి నుంచి ప్రణాళికా బద్ధంగా పనిచేస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

స్పోర్ట్స్‌ విలేజీగా గచ్చిబౌలి స్టేడియం
ఏషియన్‌ గేమ్స్‌ లాంటి చాలా ఈవెంట్స్‌ ఆర్గనైజ్‌ చేశామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. స్పోర్ట్స్‌ విలేజీగా గచ్చిబౌలి స్టేడియం ను తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాల్సిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల ఫోకస్‌ లేకపోవడం వల్ల ఈ దేశానికి క్రీడాల్లో ఆదర్శంగా నిలవాల్సిన హైదరాబాద్‌ నగరం నేడు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరిగిందన్నారు. నేడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

యువతను క్రీడల వైపు మళ్లించాలి..
తెలంగాణలో యువతను క్రీడల వైపు మళ్లించాలి.. ఆసక్తిని పెంచాలని ప్రభుత్వం సంపూర్ణంగా ఆలోచిస్తుందన్నారు. క్రీడలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దూరదృష్టితోనే 25 ఏళ్ల క్రితమే నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజీని నిర్మించినట్లు తెలిపారు. మళ్లీ 2028లో ఒలింపిక్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక మెడల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు.

సౌత్‌ కోరియాతో ఒప్పందం..
ఇటీవల సౌత్‌ కొరియా స్పోర్ట్, యూనివర్సిటీని విజిట్‌ చేయడం జరిగిందని, వారి మెనేజ్‌ మెంట్‌తో మాట్లాడటం.. తెలంగాణలో స్పోర్ట్స్‌ ను అభివృద్ధి చేయాలని వారితో ఒప్పందం కూడా జరిగిందని వెల్లడించారు. అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ’యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ‘ ని తెలంగాణలో నెక్ట్స్‌ అకడమిక్‌ ఇయర్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా నిన్న ఢిల్లీలో స్పోర్ట్స్‌ మినిస్టర్‌ను కలిసినట్లు తెలిపారు. రాబోయే ఖేల్‌ ఇండియా, నేషనల్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని, అద్భుతంగా నిర్వహిస్తామని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

ANN TOP 10