కళాకారులకు ప్రభుత్వం తరపున లభించే పురస్కారమైన నంది అవార్డ్స్ (Nandi Awards)ను కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పక్కన పెట్టేయగా.. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అదే పురస్కారాన్ని పేరు మార్చి ‘గద్దర్ అవార్డ్స్’ (Gaddar Awards) పేరిట ఇకపై కళాకారులకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత టాలీవుడ్ నుంచి సరైన స్పందన రాలేదు. మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఒకరిద్దరు తప్ప ఎవరూ స్పందించలేదు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తంగా చేయగా.. వెంటనే మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. టాలీవుడ్ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయమై దృష్టి సారించాలని కోరారు.
చిరంజీవి కోరిక మేరకు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌ని దృష్టిలో పెట్టుకుని.. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఈ విషయంపై స్పందిస్తూ.. అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ అవార్డ్స్ విధివిధినాలపై ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తున్నామని టాలీవుడ్ తరపున రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుల విషయమై.. ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారనేది కూడా అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ.. గద్దర్ అవార్డుల లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలను రెడీ చేయనుంది. (Gaddar Awards Committee Members) ఈ అవార్డుల కమిటీకీ ఛైర్మన్‌గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్‌గా దిల్ రాజు ఉండగా.. కమిటీ సలహాదారులుగా కె. రాఘవేంద్రరావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరణి, డి.సురేష్ బాబు, చంద్రబోస్, నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణు వంటివారిని సెలక్ట్ చేశారు. వీరంతా కలిసి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న గద్దర్ అవార్డ్స్‌పై కూలంకషంగా చర్చించి.. తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే.. త్వరలోనే ‘గద్దర్ అవార్డ్స్’కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.