తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వ్యక్తిగత భద్రత అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆయనకు కల్పించే సెక్యూరిటీని నిరాకరించారు. ఆయన ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లు ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలోనే వారికి భద్రత కేటాయింపులు జరిగాయి. అయితే.. తనకు వ్యక్తిగత భద్రత అవసరం లేదని కోదండరాం స్పష్టం చేశారు.
తనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని, తాను ప్రజల మనిషిని అని కోదండరాం స్పష్టం చేశారు. కాబట్టి, తనకు భద్రతా సిబ్బంది అవసరం లేదని వివరించారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే ముప్పు ఉన్నదని ఆయన తెలిపారు. తన వద్దకు ఎవరైనా వస్తే సెక్యూరిటీ వారిని అడ్డుకునే అవకాశం ఉంటుందని, ప్రజలకు కూడా సెక్యూరిటీని దాటుకుని రావడంపై కొంత ఇబ్బంది కలుగవచ్చునని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఒక అదనపు బాధ్యత మాత్రమేనని వివరించారు. ఉద్యమకారుల ఆశయాల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణ పై కొంత కాలంగా సుదీర్ఘ చర్చ జరుగుతున్నది. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ కోదండరాంకు కూడా చోటు దక్కుతుందనే చర్చ జరిగింది. అయితే, ఈ వాదనలను ఆయన ఖండించారు. తనకు మంత్రి పదవి దక్కుతుందనేది ఊహాగానాలు మాత్రమేనని, అది కేవలం ప్రచారం అని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ నిరంకుశ ప్రభుత్వంపై కొట్లాడటానికి ఐక్యోపోరాటాల పరిస్థితి ఏర్పడిందని, అందులో భాగంగానే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని మాట ఇచ్చిందని, ఆ మేరకే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై రాష్ట్ర కమిటీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.