టీవీకే పార్టీ జెండా, గీతం ఆవిష్కరణ
(అమ్మన్యూస్, చెన్నై):
తమిళ అగ్ర నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండా, గుర్తును రిలీజ్ చేశారు. చెన్నైలోని పనయూర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా, ఇటీవల విజయ్.. ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని టీవీకే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయ్, ఆయన తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాతో పాటు.. పార్టీ గీతాన్ని కూడా ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి.
పార్టీ శ్రేణులతో కలిసి ప్రతిజ్ఞ..
పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన దళపతి విజయ్.. పార్టీ శ్రేణులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. తమ పార్టీ విధానం ఇదీ అంటూ చాటిచెప్పారు. ‘మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సైనికులను ఎప్పటికీ స్మరించుకుంటాం. కులం, మతం, ప్రాంతం లింగం పేరుతో జరుగుతున్న వివక్షను మేం తొలగిస్తాం. అందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం కషి చేస్తాం. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం. వీటి ప్రజలకు అవగాహన కల్పిస్తాం.’ అని విజయ్, పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు.
2026 ఎన్నికల్లో పోటీ చేస్తాం..
ఆ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు సమాయత్తం అవుతున్న దళపతి.. నేడు తన పార్టీ జెండాను, గీతాన్ని ఆవిష్కరించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికీ మద్ధతు ప్రకటించని విజయ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పంథాను అనుసరిస్తారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా? లేక ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తారా? అనేది ఆసక్తి రేపుతోంది.