(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
రక్షా బంధన్ వేడుకలను ప్రధాని మోదీ చిన్నారుల మధ్య జరుపుకొన్నారు. వారితో రాఖీ కట్టించుకొని సరదాగా గడిపారు. ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ.. చిన్నారులు ఎంతో ప్రేమతో మోదీకి రాఖీలు కట్టారు. మోదీ తన తల్లి వద్ద కూర్చొని ఉన్న ఫొటోతో ప్రత్యేకంగా తయారు చేసిన రాఖీని ఓ చిన్నారి ప్రధానికి కట్టింది. దీన్ని చూసిన ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పిల్లలతో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. రాఖీలు కట్టే సమయంలో ఆ విద్యార్థినుల పేర్లు, క్లాస్ ఏంటో ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
దేశ ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు..
అంతకు ముందు రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అక్కా – తమ్ముళ్లు, అన్నా – చెల్లెళ్ల మధ్య అవినాభావ సంబంధాలకు, అపారమైన ప్రేమకు ఈ పండుగ నిదర్శనమన్నారు. ఈ పవిత్ర పండుగ ప్రజల జీవితాల్లో ఆప్యాయతలను, సామరస్య భావాలను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.