(అమ్మన్యూస్, హైదరాబాద్):
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తనమీద నమోదైన కేసుపై దానం స్పందించారు. ప్రహరీ కూల్చివేత, తనపై నమోదైన కేసు అంశంపై అధికారులకు ప్రివిలైజ్ నోటీస్ ఇస్తానని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ప్రహరీ కూల్చివేసిన ఘటనకు సంబంధించి తనపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్‌లోని నందగిరిహిల్స్‌లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న విషయం తెలిసి తాను అక్కడకు వెళ్లానన్నారు. తాను ప్రజాప్రతినిధిగా అక్కడకు వెళ్లానని… తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికీ లేదన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు తీర్చడమే తన బాధ్యత అన్నారు. కేసులు తనకు కొత్తేమీ కాదన్నారు. ఇప్పటికే 190 కేసులున్నాయని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు దానం.
నేను లోకల్..
రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందని దానం అన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఔట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దానం వార్నింగ్ ఇచ్చారు.
ఆ అధికారం ఎవరిచ్చారు..
హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం వారికి ఎవరిచ్చారని దానం ప్రశ్నించారు. పార్క్ స్థలం అని చెప్పి ఈవీడీఎం వాళ్లు పెద్ద ప్రహరీ కడుతున్నారని.. బస్తీ వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. గొడ కట్టొద్దన్నందుకే ఈవీడీఎం అధికారులు తనపై కేసు పెట్టారని దానం తెలిపారు. హైదరాబాద్‌ను హైడ్రా అధికారులకేమీ రాసివ్వలేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.