బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ముఖ్దంపూర్‌లో దారుణం జరిగింది. బాబా సిద్ధనాథ్ ఆలయం వద్ద సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 50 మంది గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటినా ఆలయానికి చేరుకున్నారు. భక్తుల్ని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
మరోవైపు సిద్ధనాథ్ ఆలయాన్ని జెహనాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాండే సందర్శించారు. బాధితులకు వెంటనే వైద్య సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆలయంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. మరణించినవారి కుటుంబ సభ్యులను కలిసి విచారిస్తున్నామని.. మరికొందరు మృతులను గుర్తించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. అయితే సిద్ధనాథ్ ఆలయం వద్ద కొండపైకి ఎక్కుతుండగా వారిని నియంత్రించేదుకు ఆలయ సిబ్బంది లాఠీచార్జి చేయడంతోనే తొక్కిసలాట జరిగిందని పలువురు ఆరోణలు చేస్తున్నారు.