తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధిస్తాం
శ్రీవారి సన్నిధిలో భట్టి విక్రమార్క
కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం
(అమ్మన్యూస్, తిరుమల):
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్ స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు భట్టి, ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తెలంగాణలో అభివృద్ధి శరవేగం
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే కాలంలో మరింత అభివిద్ధి చేస్తామని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేసేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఆమేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భట్టి పేర్కొన్నారు.