AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గాజాలో పాఠశాలపై ఇజ్రాయేల్ బాంబు దాడి.. 100 మందికిపైగా మృతి

హమాస్, హెజ్బొల్లా అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఏ క్షణమైనా ఇజ్రాయేల్‌పై హమాస్, ఇరాన్ దాడులతో విరుచుకుపడే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలోనూ గాజాపై ఇజ్రాయేల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. తాజాగా, తూర్పు గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్‌ బాంబులు వేసింది. ఈ ఘటనలో దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. నిరాశ్రయులు తలదాచుకుంటున స్కూల్‌పై టెల్ అవీవ్ సైన్యం విచక్షణారహితంగా దాడులకు తెగబడింది. అయితే, ఇది హమాస్ కమాండ్ సెంటర్ అని ఇజ్రాయేల్ ఆరోపిస్తోంది.

‘అల్-సాహబా ప్రాంతంలో అల్- తబీన్ స్కూల్‌పై ఇజ్రాయేల్ జరిపిన దాడిలో 40 మంది వీరులు అమరులయ్యారు.. డజన్ల కొద్దీ గాయపడ్డారు’ అని హమాస్ అధికార ప్రతినిధి మొహమూద్ బసల్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది భయంకరమైన ఊచకోత అని, పలువురు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మంటలను అదుపుచేసి అమరుల మృతదేహాలు బయటకు తీయడం, గాయాలతో ఉన్నవారిని రక్షించడానికి రెస్క్యూ దళాలు ప్రయత్నిస్తున్నాయని బసల్ తెలిపారు.

గత వారం కూడా గాజాలోని మూడు స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్‌ దాడి చేసింది. ఇటీవల ఓ పాఠశాలపై జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారు. ఆగస్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. తాజా దాడిని ఇజ్రాయేల్ సమర్ధించుకుంది.

గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయేల్‌లోకి చొరబడిన హమాస్‌.. నరమేథానికి తెగబడింది. ఈ మెరుపు దాడులకు అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్‌ వైమానిక దాడులు, క్షిపణలు, బాంబులతో గత 10 నెలలుగా విరుచుకుపడుతోంది. హమాస్, ఇజ్రాయేల్ యుద్ధంలో ఇప్పటివరకు 40,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10