ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
(అమ్మన్యూస్, టోక్యో):
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి దీవులైన క్యుషు, షికోకును శక్తివంతమైన భూకంపం వణికించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.1గా నమోదైంది. 5 నిమిషాల పాటు భూమి కంపించింది. భూకంపం ధాటికి భారీ భవంతులు ఊగిపోయాయి. ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
సునామీ హెచ్చరికలు..
భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు చేశారు. మియాజాకి, కొచ్చి, ఓయిటా, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక క్యుషులోని మియాజాకి ప్రిఫెక్చర్‌లో ఇప్పటికే 20 సెంటీమీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం..
భూకంపం ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దక్షిణ జపాన్‌లోని క్యుషు, షికోకులోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. హ్యుగా–నాడా సముద్రంలో భూకంపం సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలు, నదులు, సరస్సులు సమీపంలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది అక్కడి ప్రభుత్వం.