తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతోంది. ప్రముఖ వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అమెరికాలో సీఎం రేవంత్ సమక్షంలో వివింట్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వివింట్ ఫార్మా ముందుకు వచ్చింది. తద్వారా ఇంజెక్టుల్స్ తయారీ యూనిట్‌తో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగవకాశాలను కల్పించనుంది. ఇప్పటికే లైఫ్ సైన్సెస్‌కు గ్లోబల్ హబ్‌గా తెలంగాణ నిలిచింది. జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ రీసేర్చ్ అండ్ డెవెలప్మెంట్ కేంద్రం కూడా అందుబాటులో ఉంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ”జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా కంపెనీ ముందుకు రావటంపై చాలా సంతోషం. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సహకారం అందిస్తాం. పరిశ్రమలకు అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం . తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంది. జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుంది” అని చెప్పారు.