జనం బిక్కుబిక్కు
అధికారుల తీరుపై తుమ్మల ఫైర్
(అమ్మన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ఆలయ అన్నదాన సత్రం భారీ వర్షాలకు నీట మునిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షానికి రామాలయ ప్రాంతం తడిసి ముద్దయింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినా ఇరిగేషన్ అధికారుల తీరు మారలేదు. గోదావరి నది కరకట్ట స్లూయిజ్ ల నుంచి వర్షపు నీటిని పంప్ చెయ్యకపోవడం వల్ల మరో సారి నీట మునిగింది రామాలయ ప్రాంతం.
కిన్నరసానికి వరద పోటు..
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులుకాగా, ప్రస్తుత నీటిమట్టం 404.10అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 4,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 10,000 క్యూసెక్కులు ఉండడంతో 2 గేట్లు ఎత్తారు. 10,000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నదీ ప్రవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గుండాల, ఆళ్ళపల్లి ఏజెన్సీ మండలాలలో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 16 అడుగులుగా ఉంటుంది. ప్రస్తుత నీటి మట్టం 16.09 అడుగులకు చెరుకోవటంతో అలుగు పారుతోంది.
తుమ్మల ఆగ్రహం
వరద నీటిని గోదావరిలోకి ఎత్తి పోయడానికి మోటార్లు ఏర్పాటు చేసినా వాటిని ఆన్ చేయకపోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద చేరినా వెంటనే మోటార్లు ఎందుకు ఆన్ చేయలేందంటూ మండిపడ్డారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భద్రాద్రిలో భయం భయం:
భారీ వర్షాల కారణంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలోని రంగనాయకుని గుట్టపై ఉన్న కుసుమ హరనాధ్ బాబా ఆలయ మండపం ప్రమాదకరంగా మారింది. వర్షం కారణంగా నేల కిందిగి కుంగిపోవడంతో మండపం పక్కకు ఒరిగింది. దీంతో మండపం కింద ఉన్న బండరాళ్లు జారిపడి కింద ఉన్న ఇంటి గోడలను తాకాయి. మండపం పూర్తిగా కూలిపోయేలా ప్రమాదకరంగా మారడంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.