(అమ్మన్యూస్, హైదరాబాద్):
నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్లను ఎన్‌ఎస్పీ అధికారులు ఎత్తివేశారు.
సాగర్ నుంచి ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక్కో గేట్ నుంచి సుమారు 5 నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వెంటనే అధికారులు నాగార్జునసాగర్ దిగువన ప్రాంతాలకు హైఅలర్ట్ జారీ చేశారు. నాగార్జున సాగర్ దిగువన కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు నాగార్జునసాగర్ గేట్లు తెరిచారు.
కృష్ణమ్మకు జలహారతి
దిగువన కృష్ణా నది ప్రాంతాల అప్రమత్తత కోసం మూడు సైరన్లను అధికారులు మోగించారు. అంతకుముందు అధికారులు ఎస్‌ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఓపెన్ చేశారు. సుమారు 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కృష్ణమ్మ ఉరకలు..
కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జునసాగర్‌లో రోజురోజుకు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 4 లక్షల 41 వేల క్యూసెక్కులకు పైగా ఉంది. ఇదిలా ఉండగా, నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా..ప్రస్తుతం నీటి మట్టం 580 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా..ప్రస్తుతం 284 టీఎంసీలు ఉన్నాయి.