పొట్టి సిరీస్‌లో శ్రీలంకను అల్లాడించిన భారత జట్టు (Team India) వన్డే సిరీస్‌లో తేలిపోతోంది. తొలి వన్డేను అనూహ్యంగా టైతో ముగించిన టీమిండియా రెండో వన్డేలో స్పిన్ ఉచ్చులో విలవిలాడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(62) మెరుపు ఆరంభమిచ్చినా.. లంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్స్(6/33) ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ప్రేమదాస స్టేడియంలో భారత టాపార్డర్, మిడిలార్డర్‌ను డగౌట్‌కు పంపి లంకను గెలుపు వాకిట నిలిపాడు. అయితే.. అక్షర్ పటేల్(44), వాషింగ్టన్ సుందర్(15)లు మొండిగా పోరాడి ఆశలు రేపారు. కానీ, గత మ్యాచ్‌లో ఆఖరి రెండు వికెట్లు తీసిన లంక సారథి చరిత అలసంక(3/20) టెయిలెండర్ల పని పట్టాడు. దాంతో, ఆతిథ్య జట్టు 32 పరుగులతో గెలుపొంది మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వన్డే సిరీస్‌లో బోణీ కొట్టేందుకు సిద్దమైన భారత్ రెండో వన్డేలో లంకను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన మోస్తరు ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(62) దూకుడుగా ఆడాడు. లంక బౌలర్లను ఉతికేస్తూ వరుసగా రెండో ఫిఫ్టీతో గర్జించాడు.
కమింద్ మెండిస్ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచిన రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, పవర్ ప్లేలో టీమిండియా పవర్ ప్లేలో 76 పరుగులు చేసింది. ఆ దశలో రోహిత్ సేన ఆడుతూ పాడుతూ గెలుస్తుందని అభిమానులంతా అనుకున్నారు. కానీ, ఒకే ఒక్కడు మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
తొలి ఆరు వికెట్లు
గాయపడిన హసరంగ స్థానంలో అవకాశం దక్కించుకున్న లెగ్ స్పిన్నర్ జెఫ్రే వాండర్సే(6/33) తొలి ఆరు వికెట్లు పడగొట్టి భారత్‌కు బిగ్ షాకిచ్చాడు. అతడి విజృంభణతో ఒకదశలో 97/0తో పటిష్ట స్థితిలో ఉన్న భారత్ ఒక్కసారిగా పడిపోయింది. హసరంగ స్థానంలో వచ్చిన వాండర్సే 50 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు తీసి టీమిండియాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. తొలుత రోహిత్ వికెట్ తీసిన వాండర్సే.. ఆ తర్వాత వరుస పెట్టి శుభ్‌మన్ గిల్(35), శివం దూబే(0), విరాట్ కోహ్లీ(14), శ్రేయస్ అయ్యర్(7), కేఎల్ రాహుల్(0)లను ఔట్ చేశాడు.
ఆశలు రేపిన అక్షర్, సుందర్
స్టార్ ఆటగాళ్లంతా డగౌట్‌కు చేరినవేళ అక్షర్ పటేల్(44), వాషింగ్టన్ సుందర్(15)లు అసమాన పోరాటం చేశారు. ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో ఓటమి దాదాపు ఖరారారైంది. కుల్దీప్ యాదవ్(7), సిరాజ్(4)లు కాసేపు ప్రతిఘటించినా అసలంక ధాటికి చేతులెత్తేశారు. దాంతో, టీమిండియా 32 పరుగుల ఓటమిని మూటగట్టుకుంది.
సమష్టి పోరాటంతో..
టాస్ గెలిచిన శ్రీలంక రెండో వన్డేలో సమిష్టి పోరాంటతో మోస్కరు స్కోర్ చేసింది. భారత బౌలర్ల ధాటికి రెండొందల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన లంక 240 రన్స్ కొట్టింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40) రాణించగా.. గత మ్యాచ్ హీరో దునిత్ వెల్లలాగే(39) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.