రైతన్నల పక్షపాతి
విద్య వైద్యానికి పెద్ద పీట
త్వరలోనే 4. 50 లక్షల ఇళ్లు నిర్మిస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లిలో విస్తృత పర్యటన
(అమ్మన్యూస్, ఖమ్మం):
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత పేదలు, రైతులు సంతోషంగా ఉన్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, గువ్వలగూడెంలో పర్యటించారు. ఈ సందర్భగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్య వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపట్టిందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత పేదలు, రైతుల పక్షపాతిగా ఉందని, 31 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేస్తుందన్నారు.
ధరణిని ప్రక్షాళన చేస్తున్నాం..
ధరణి వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆనాడు గొప్పలు చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నేతలు ధరణిపై అబద్ధాలు చెపుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది రోజుల్లో 4 లక్షల 50 వేల ఇళ్లు కట్టబోతున్నామని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారని, గత ప్రభుత్వం తీసుకున్న భూములను పేదలకు పంచుతామని స్పష్టం చేశారు.
ఏడు నెలలు కూడా కాలే. అప్పుడే విమర్శలు..
ఏడు నెలలు పూర్తి కాకుండానే ఏం చేయలేదని ప్రతి పక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని, గత ప్రభుత్వ పాలనలోనే ఆత్మహత్యలు జరిగాయని, కాంగ్రెస్ వచ్చింది కాబట్టే కరెంటు, నీళ్లు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, మంచి పరిపాలన కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఆడబిడ్డలు, రైతన్నల ముఖాల్లో ఆనందం చూడలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.