ఉబ్బితబ్బిబ్బయిన అభిమానులు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. వచ్చేత్తా పా.. అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సరదాగా ఫోర్ వీల్ బైక్ ను నడిపారు. తమ నాయకుడు పుర వీధుల్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అలా సాగిపోతుంటే చూసి మురిసిపోయారు నల్గొండ ప్రజానీకం. అభిమానుల కేరింతలు, కేకలు, హర్షధ్వానాలతో సందడి వాతావరణం నెలకొంది ఆ ప్రాంతమంతా. వర్క్ విషయంలో సీరియస్ గా ఉండే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాహనాలను నడిపే విషయంలో మాత్రం సరదాగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక వాహనం తో రోడ్డు మీద కనిపించే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గతంలో బస్సు, ట్రాక్టర్, ఆటోలను నడిపి వార్తలలోకి ఎక్కేవారు. ఇప్పుడు సరికొత్తగా ఫోర్ వీలర్ బైక్ పై రాజసంగా అలా ప్రజల మధ్య డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే చుట్టుపక్కల జనం చూసి మురిసిపోయారు.
ఫొటోలు తీసేందుకు అత్యుత్సాహం
తమ ప్రియతమ నేత అలా బండెక్కి ఉత్సాహంగా డ్రైవ్ చేస్తుంటే చూసేందుకు తరలి వచ్చారు. అంతకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. తర్వాత బయటకొచ్చేసరికి కార్యకర్తలు ఉపయోగించే ఫోర్ వీలర్ బైక్ కనిపించింది. దానితో తాను డ్రైవ్ చేస్తానని కోరడంతో కార్యకర్తలు అక్కడికక్కడే ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజలంతా ఆయన బండి వెనక పరిగెత్తుకుంటూ వెళుతూ ఆయనతో ఫొటోలు దిగేందుకు అత్యుత్సాహం చూపారు. అయితే చాలా మంది ఆయన బైక్ ను నడిపించడాన్ని వీడియోగా తీయగా కొందరు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాలలో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.