ఏపీలోని నంద్యాల జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలోని వైసీపీకి చెందిన కీలకనేతను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ అధికార పార్టీ నేతలు కౌంటర్‌లు ఇస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో ఈ హత్య సంచలనంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో దారుణం చోటుచేసుకుంది. మండలానికి చెందిన వైసీపీ నేత సుబ్బారాయుడిని దుండగులు రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దాడిలో సుమారు 40 మంది ఉన్నారని సమాచారం. అయితే, గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులే తన భర్తను పొట్టపపెట్టుకున్నారంటూ సుబ్బారాయుడు భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అత్యంత సన్నిహిత అనుచరుడని సమాచారం. ఈ కారణంగానే సుబ్బారాయుడుని అత్యంత దారుణంగా దాడి చేసి చంపేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సీతారామపురం గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పికెట్‌ను ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ఎస్పీ అదిత్ రాజ్ సింగ్ రాణా గ్రామంలో పర్యటించారు.