కోర్బా- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు బోగీలు మంటల్లో చిక్కుకున్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రత బలగాలు, పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఏసీ బోగీలో షార్ట్ సర్క్యుట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తోన్నారు.
ఈ ఉదయం ఈ ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫామ్ మీదికి చేరుకున్న కొద్ది సేపటికే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బీ6, బీ7, ఎ1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని సమాచారం. అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో దట్టమైన పొగ అలుముకుంది. ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. శనివారం సాయంత్రం 4:10 నిమిషాలకు కోర్బా నుంచి బయలుదేరిన నంబర్ 18517 ఎక్స్‌ప్రెస్.. భిలాస్‌పూర్ జంక్షన్, రాయ్‌పూర్ జంక్షన్, మహాసముంద్, పార్వతీపురం టౌన్, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం జంక్షన్, సింహాచలం మీదుగా ఈ ఉదయం విశాఖపట్నానికి చేరుకుంది. ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. తొలుత దట్టమైన పొగ వెలువడింది. ముందుగా ఏ1 బోగీలో పొగ అలముకుంది. అప్రమత్తమైన ప్రయాణికులు అలారం మోగించారు. కిందికి దిగిపోయారు. ఆ మరుక్షణమే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. మూడు బోగీలు మంటల బారిన పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఏసీ బోగీలో షార్ట్ సర్క్యుట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తోన్నారు.