జూన్‌లో నోటిఫికేషన్లు
డిసెంబర్‌లోగా నియామకాలు..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మరికొద్ది సేపట్లో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నారు. జాబ్ క్యాలెండర్ లో 60–80 వేల ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా.. ప్రతీ ఏడాది మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే జూన్ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేస్తారు. జాబ్ క్యాలెండర్ లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించనున్నారు. జాబ్ క్యాలెండర్ లో 60–80 వేల ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
మేనిఫెస్టోలో 2లక్షల ఉద్యోగాలు..
ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్టుమెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాని హామీ ఇచ్చింది. అంతేకాదు దరఖాస్తుదారులకు అభ్యర్థులు ఒక రూపాయి ఫీజు కట్టాల్సిన అవసరం లేదని మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే 2024 ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్–2 నోటిఫికేషన్, డిసెంబరు 15న రెండో ఫేజ్ నోటిఫికేషన్, జూన్ 1, డిసెంబరు 1 – రెండుసార్లు గ్రూప్–3, 4 నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది.