AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో స్పోర్ట్స్‌ పాలసీ.. బేగరికంచలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ స్టేడియం

విద్యార్థులు ఆటల్లోనూ రాణించేలా ఏర్పాట్లు
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్‌ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలిపారు. అంతేకాకుండా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. పిల్లలను పుస్తకాలకు పరిమితం చేసి క్రీడలకు దూరం చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్పోర్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి స్టేడియంలో వివిధ రకాల క్రీడలు జరిగాయన్నారు. వివిధ కారణాల చేత గేమ్స్‌ నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. ‘పుల్లెల గోపీచంద్‌ అకాడమీకి ల్యాండ్‌ ఇచ్చాం. ఆ అకాడమీ నుంచి చాలా మంది క్రీడాకారులు తయారయ్యారు. ప్రయివేటు అకాడమీలు కాకుండా ప్రభుత్వం తరపున శిక్షణ ఇస్తే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది.. అందుకే ప్రత్యేకంగా ఈ బడ్జెట్‌లో స్పోర్ట్స్‌ కోసం రూ. 361 కోట్లు కేటాయించామని’ రేవంత్‌ రెడ్డి తెలిపారు.

పిల్లలను క్రీడలకు దూరం చేస్తున్నారు..
పిల్లలను పెద్ద పెద్ద చదవులు చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారిని పుస్తకాలకే పరిమితం చేసి క్రీడలకు దూరం చేస్తున్నారని సీఎం అన్నారు. ‘ఆటల్లో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి దొరుకుతుంది.. ఆ కుటుంబానికి గౌరవం కూడా లభిస్తుంది. ఈ విషయం ప్రపంచానికి తెలియజేసేందుకే నిఖత్‌ జరీన్‌కు, సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. ఇళ్లు కట్టుకునేందుకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో 600 గజాల చొప్పున స్థలం కేటాయించాం అని సీఎం పేర్కొన్నారు.

స్పోర్ట్స్‌ పాలసీపై స్టడీ చేశాం..
రాష్ట్రంలో స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొస్తామని సీఎం తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో స్టడీ చేసి సమాచారం సేకరించామన్నారు. హర్యానా రాష్ట్రంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కాబట్టి హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలను అనుసరించాలని నిర్ణయించాం. వచ్చే సమావేశాల్లో స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

మినీ స్పోర్ట్స్‌ స్టేడియం..
ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్పోర్ట్స్‌ స్టేడియంను నిర్మిస్తామని, రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో మాట్లాడుతున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ప్రాంతానికి న్యాక్‌ను షిప్టు చేస్తాం. బేగరికంచెలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ స్టేడియంను నిర్మించడానికి భూమి కేటాయిస్తాం. క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ వారు ముందుకు వచ్చారు. ఈ స్పోర్ట్స్‌ విషయంలో నిధుల కేటాయింపుతో పాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. ఈ రాష్ట్రంలో యువతను వ్యసనాల నుంచి బయటకు తీసుకురావలంటే స్పోర్ట్స్‌ను ప్రోత్సహించాలి. స్పోర్ట్స్‌ పాలసీకి సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. కోట్ల విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, సరూర్‌ నగర్, ఎల్‌బీ స్టేడియంలు రాజకీయ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ప్రపంచంలో మన పిల్లలు పతకాలు సాధించే విధంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం’ అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

ANN TOP 10