AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లోనే ఉన్నా.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వెల్లడి

సీఎం రేవంత్‌తో భేటీ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తనపై వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి. అవన్నీ ఫేక్‌ వార్తలు అంటూ వెల్లడించారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నాలుగు రోజులకే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే, మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగాలని, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డికి జూపల్లి హామీ ఇచ్చారు. దీంతో ఆయన మనస్సు మార్చుకుని కాంగ్రెస్‌ లోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జూపల్లి కృష్ణారావుతో కలిసి జూబ్లీహిల్స్‌ లోని సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి ఆయన వెళ్లారు. సీఎం రేవంత్, కృష్ణ మోహన్‌ రెడ్డి మధ్య దాదాపు అరగంటపాటు మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని రేవంత్‌ రెడ్డికి కృష్ణమోహన్‌ రెడ్డి స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.

అరగంటకు పైగా భేటీ..
ఇరువురు మధ్య దాదాపు అరగంటపాటు వివిధ అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తనపై కావాలనే బీఆర్‌ఎస్‌ నేతలు బురద జల్లారంటూ చెప్పే ప్రయత్నం చేశారాయన. అవన్నీ తనకు తెలుసని, వాళ్లతో జాగ్రత్త ఉండాలని ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి సూచన చేసినట్టు తెలుస్తోంది. అనంతరం అక్కడికి వెళ్లిన నేతలతో కలిసి ఫొటో దిగారు. అక్కడినుంచి సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా బండ్ల మీడియాతో మాట్లాడుతూ నేనే కాంగ్రెస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అవన్నీ ఫేక్‌ వార్తలంటూ కొట్టిపారేశారు.

ANN TOP 10