AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్ట్‌.. సీఎం వ్యాఖ్యలపై నిరసన..

అసెంబ్లీ వెల్‌లో బైఠాయింపు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీలో వెల్‌లో బైఠాయించారు. సీఎం రేవంత్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం ఛాంబర్‌ ఎదుట ధర్నా చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. మర్షల్‌ వారిని అసెంబ్లీ వెలుపలకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు వారిని వాహనంలో అసెంబ్లీ నుంచి తరలించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పద్మారావు గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌ జాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురి సభ్యులను అరెస్టు చేశారు.

విపక్షం గొంతు నొక్కారు.. హరీశ్‌..
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. శాసనసభలో విపక్షం గొంతునొక్కారన్నారు. ఎన్నిసార్లు కోరినా స్పీకర్‌ మైక్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవని, తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు శాసనసభలో చూడడం దురదృష్టకరమన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్నారు.

సీఎం క్షమాపణలు చెప్పాల్సిందే.. కేటీఆర్‌..
ముమ్మూటికీ ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని.. అప్పటి వరకు విడిచిపెట్టేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ కేటీఆర్‌ నినదించారు. మరోవైపు శాసనసభలో మూడుగంటలుగా నిల్చొని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి నిరసన తెలిపారు. సీఎం క్షమాపణలు చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ANN TOP 10