AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిక్కుల్లో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్.. వెలుగు చూసిన 1000 కోట్ల స్కామ్..

షాకింగ్‌ గా జీఎస్టీ స్కాం..
రూ.వెయ్యి కోట్లపైనే కుంభకోణం
రాష్ట్రంలో పెనుసంచలనం
మాజీ సీఎస్‌ సోమేష్‌పై కేసు
పన్ను ఎగవేతదార్లకు పూర్తి సహకారం
ఏ5గా పేర్కొన్న సీసీఎస్‌ పోలీసులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ మరో అవినీతి చిట్టా వెలుగులోకి వచ్చింది. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన జీఎస్టీ ఎగవేత కుంభకోణం తెలంగాణలో పెను సంచలనంగా మారింది. ఈ స్కాంలో తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన సోమేష్‌కుమార్‌ పేరు ఉండటం.. ఆయనను ఏ5గా పేర్కొంటూ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదార్లకు వీరు సహకరించటంతో వేలాది కోట్ల రూపాయిల మేర అక్రమాలు జరిగినట్లుగా జీఎస్టీ జాయింట్‌ కమిషనర్‌ రవి కానూరి ఇచ్చిన కంప్లయింట్‌ మేరకు ఈ కేసు నమోదైంది.

ఒక్క బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచే..
ఈ కేసులో భాగంగా ఒక్క తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్యపన్నుల శాఖకు రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మరో పదకొండు ప్రైవేటు సంస్థలు సుమారు రూ.400 కోట్లు పన్ను ఎగవేసినట్లుగా ప్రాథమికంగా వెల్లడైనట్లుగా ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఈ కేసు నిందితుల జాబితాలో.. వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్‌ ఎస్‌ వి కాశీవిశ్వేశ్వరరావు.. డిప్యూటీ కమిషనర్‌ (హైదరాబాద్‌ రూరల్‌) శివప్రసాద్‌.. ఐఐటీ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెస్‌ శోభన్‌ బాబు.. ప్లియాంటో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తో పాటు ఐదో నిందితుడిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి (చీఫ్‌ సెక్రటరీ) సోమేష్‌ కుమార్‌ పేరును చేర్చారు. పన్ను ఎగవేతదార్లకు వీరు సహకరించారని.. ఈ కారణంగా వేలాది కోట్ల అక్రమాలకు కారణమైనట్లుగా ఆరోపిస్తున్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు కొన్ని..
సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్న అంశాలను చూస్తే..
– మానవ వనరుల్ని సరఫరా చేసే బిగ్‌ లీవ్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పన్ను చెల్లించకుండా రూ.25.51 కోట్ల ఇన్‌ పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ తీసుకొని మోసానికి పాల్పడింది. దీంతో వాణిజ్యపన్నుల శాఖ ఇంటర్నల్‌ గా విచారణ చేపట్టింది.
– వాణిజ్య పన్నుల శాఖకు టెక్నాలజీని అందించే సర్వీస్‌ ప్రొవైడర్‌ గా ఐఐటీ హైదరాబాద్‌ వ్యవహరించింది. దీని పనేమిటన్నది చూస్తే.. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ లలో అక్రమాలను గుర్తించటం. ఆ డేటాను విశ్లేషించటం. ఎవరైనా పన్ను చెల్లింపుదారులు అక్రమాలకు పాల్పడితే సర్వీస్‌ ప్రొవైడర్‌ రూపొందించిన స్క్రూటినీ మాడ్యూల్‌ గుర్తించాల్సి ఉంటుంది.

– అయితే.. ఇదేమీ జరగలేదు. ఈ అంశాన్ని బిగ్‌ లీవ్‌ టెక్నాలజీస్‌ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్‌ గుర్తించకపోవటాన్ని సీరియస్‌ గా తీసుకున్న జీఎస్టీ.. అంతర్గత విచారణను చేపట్టారు. ఈ క్రమంలో తీగ లాగగా.. డొంక కదిలింది. భారీ కుంభకోణం బయటకు వచ్చింది.
– బిగ్‌ లీప్‌ అక్రమాల నేపథ్యంలో జీఎస్టీ శాఖకు చెందిన ఒక అధికారిని గత ఏడాది డిసెంబరు 26న ఐఐటీ హైదరాబాద్‌ వర్సిటీలో విచారణ చేపట్టారు. అప్పటి రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీతో పాటు ఎస్‌.వి. కాశీవిశ్వేశ్వరరావు.. శివరామప్రసాద్‌ ల మౌఖిక ఆదేశాలతో అక్రమాలను గుర్తించకుండా ఉండేలా సాఫ్ట్‌ వేర్‌ లో మార్పులు చేసినట్లుగా అంతర్గత నివేదికలో పేర్కొన్నారు.

– సాఫ్ట్‌ వేర్‌ లో మార్పులతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. ప్లియాంటో టెక్నాలజీస్‌ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా నిందితులైన కాశీవిశ్వేశ్వరరావు.. శివప్రసాద్‌.. ప్లియాంటో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ను వాణిజ్యపన్నుల శాఖ వివరణ కోరగా.. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఆదేశాలతోనే తాము సాఫ్ట్‌ వేర్‌ లో మార్పులు చేయాలని చెప్పారంటూ ఈ ఇద్దరు పేర్కొనడం గమనార్హం. ఇలా చాలా ఎఫ్‌ఐఆర్‌లో వెలుగుచూశాయి.

ANN TOP 10