అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అదిపెద్ద హామీ.. రైతులకు 2 లక్షల రుణమాఫీ. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. మూడు విడతల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే.. జులై 18వ తేదీని మొదటి విడతగా.. లక్ష లోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపించింది సర్కారు. కాగా.. లక్ష నుంచి లక్షన్నర వరకు అప్పు ఉన్నోళ్లు, 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులంతా ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
కల్వకుర్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. జూలై 31 లోపు రెండో విడత కింద లక్షన్నర వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని.. తిరిగి వచ్చిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఈ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.