ఎగువన భాగాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో జూరాల, సుంకేశుల నుంచి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
సుంకేశుల (Sukensula) నుంచి 1.40 లక్షల క్యూసెక్కులు, జూరాల (Jurala Project) నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలానికి సుమారు 4.40 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ అధికారులు ఎడమ, కుడిగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 60,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 872.60 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. మరో 13 అడుగుల నీటి మట్టం పెరిగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. నిర్దేశించిన స్థాయి వరకు నీటి మట్టం పెరిగితే ఒకటి, రెండురోజుల్లో శ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.