AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అదరగొట్టిన ‘పురుషోత్తముడు’.. సినిమా చూసి తీరాల్సిందే.. రివ్యూ – రేటింగ్‌ ఇదిగో..

రాజ్‌ తరుణ్‌ నటించిన ‘పురుషోత్తముడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్‌.. వంటివి సినిమాపై అందరి దృష్టి పడేలా చేశాయి. ఇంతకీ ‘పురుషోత్తముడు’ ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం,


కథ: లండన్‌లో చదువుకుని హైదరాబాద్‌ కి వస్తాడు రచిత్‌ రామ్‌ (రాజ్‌ తరుణ్‌). తండ్రి(మురళీశర్మ) అతన్ని తన పరశురామయ్య ఎంటర్‌ప్రైజెస్‌ అనే కంపెనీకి సీఈఓను చేయాలని అనుకుంటాడు. అయితే కంపెనీ బైలాస్‌ ప్రకారం.. సీఈఓ అవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లిపోయి, తమ పలుకుబడి ఎక్కడా వాడకుండా సామాన్య జీవితం గడపాలి. వంద రోజుల పాటు తమకు సంబంధించిన వివరాలు గురించి ఎక్కడ ఎవరికీ చెప్పకూడదు. లేదు అంటే వారికి సీఈఓ అయ్యే అర్హత ఉండదు అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది వసు(రమ్యకృష్ణ). రచిత్‌ రామ్‌ కనుక ఆ షరతును ఉల్లంఘిస్తే తన కొడుకు(విరాన్‌ ముత్తంశెట్టి) సీఈఓ అవుతాడు అనేది ఆమె అత్యాశ. ఈ క్రమంలో రచిత్‌ రామ్‌.. ఆ షరతులకు లోబడి కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తాడు. ఈ క్రమంలో అసలు కథ మొదలవుతుంది. తాను వెళ్లిన ఊరిలో అన్యాయానికి గురవుతున్న రైతులకు సపోర్టుగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? తర్వాత ఆ ఊర్లో పూల తోటలు పెంచుతున్న అమ్ములు(హాసిని సుధీర్‌)కి ఎందుకు దగ్గర కావాల్సి వచ్చింది? ఫైనల్‌గా రచిత్‌ రామ్‌ సీఈవో అయ్యాడా? లేదా? వంటివి తెలుసుకోవాలంటే సినిమా థియేటర్‌కు వెళ్లాల్సిందే!

నటీనటుల ప్ర‌తిభ‌:
గ‌త సినిమాల కంటే రాజ్ తరుణ్ ఇందులో కాస్తా గ్లామ‌ర్‌గానే క‌నిపిస్తాడు. ‘శ్రీమంతుడు’లో మహేష్ బాబు చేసినటువంటి రోల్ రాజ్ త‌రుణ్ చేశాడు. త‌న న‌ట‌న‌తో త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ తన అందంతో ఆకట్టుకుంది. యాక్టింగ్‌లో ఇంకాస్త ప‌రిణితి పొందాలి. రమ్యకృష్ణ త‌న పాత్ర‌లో హుందాగా న‌టించి స‌త్తా చూపింది. ఆమె కొడుకుగా అల్లు అర్జున్ కి బావమరిది వరస అయ్యే విరాన్ ముత్తంశెట్టి నటించి ప‌ర‌వాలేద‌నిపించాడు. మురళీ శర్మ తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూపించాడు. ప్రవీణ్ కామెడీ మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంది. ప్రకాష్ రాజ్..ది అతిథి పాత్రలా అనిపించినప్పటికీ.. చివర్లో ఆ పాత్రతో చెప్పించిన డైలాగులు బాగా పేలాయి. మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక విభాగం:
టెక్నికల్‌ క్వాలిటీ పరంగా సినిమాకు ఫుల్‌ మార్కులు వేయవచ్చు. ఫోటోగ్రఫీ బాగుంది. గోపీసుందర్‌ సంగీతం కూడా సినిమాకి ప్లస్‌ పాయింట్‌ అని చెప్పాలి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. మాటలు కూడా బాగున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా నిర్మాతలు సరైన బడ్జెట్‌ పెట్టినట్టు అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌ పెద్ద హీరో సినిమాల్లో చూసినట్లు రిచ్‌ గా అనిపిస్తుంది. రన్‌ టైం కూడా 2 గంటలే ఉండటం మరో ప్లస్‌ పాయింట్‌ గా చెప్పాలి.

విశ్లేషణ :
డైరెక్ట‌ర్ తాను అనుకున్న క‌థ‌ను స్ప‌ష్టంగా తెర‌పైకి ఎక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. స్క్రీన్ ప్లే పరంగా మంచి మార్కులు వేయొచ్చు. B, C సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాళ్లకి లాజిక్స్ తో సంబంధం ఏమీ ఉండదు. పడాల్సిన చోట ఫైట్లు, కామెడీ ఉంటే.. వాళ్ళు టైం పాస్ చేసేస్తారు. కాబట్టి వాళ్లకు ఈ సినిమాని నచ్చే విధంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. క‌థ‌, పాట‌లు, ఫైటింగ్‌లు స‌రైన పాళ్ల‌లో ఉన్న ఈ ‘పురుషోత్తముడు’ ఈ వీకెండ్‌లో చూడ‌వ‌చ్చు.

రాజ్ తరుణ్ (Hero)
హాసిని సుధీర్ (Heroine)
బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీశర్మ,విరాన్ ముత్తంశెట్టి తదితరులు (Cast)
రామ్ భీమన (Director)
ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్ (Producer)
గోపీ సుందర్ (Music)
పి జి విందా (Cinematography)

రేటింగ్‌ : 3.25 / 5

ANN TOP 10