రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులే నిదర్శనం
కేంద్ర బడ్జెట్‌లో తీరని అన్యాయం
(అమ్మన్యూస్, నల్లగొండ):
మాది రైతు ప్రభుత్వమని, రాష్ట్ర బడ్జెట్లో రూ.72,659 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడమే నిదర్శనమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై శుక్రవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీకి 31 వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. దక్షిణ తెలంగాణ లోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధుల కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
ప్రాజెక్టుల పూర్తికి అధిక నిధులు..
ఎస్‌ఎల్బీసీ సొరంగం, శివన్న గూడెం, బ్రాహ్మణ వెల్లెముల, పాలమూరు– రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల పూర్తికి ఎక్కువ నిధులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధికి 29 వేల కోట్ల రూపాయలు, ఆర్ అండ్ బీకి 7,315 కోట్ల రూపాయల కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని విమర్శించారు. తెలంగాణ నిధులు కేటాయించకపోవడం బీజేపీకి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు.