AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ బాస్ ఎమ్మెల్యేలతో చర్చలు చేయనున్నారు. ఈ క్రమంలో మేడిగడ్డ పర్యటన అయిన వెంటనే హైదరాబాద్‌కు రావాలని ఆదేశించారు. దీంతో క్యాతనపల్లిలో మధ్యాహ్నం జరగాల్సిన మీడియా సమావేశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రద్దు చేసుకున్నారు.

కాగా… ప్రతిపక్షనేతగా తొలిసారి కేసీఆర్ నిన్న(గురువారం) అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సభలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ ప్రసంగం 12:02 గంటలకు ప్రారంభం కాగా.. 25 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 12:04 గంటల సమయంలో ఆయన సభలోకి అడుగుపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం 1:50 గంటలకు ముగియగా.. దానికంటే రెండు నిమిషాల ముందే కేసీఆర్ బయటికి వెళ్లిపోయారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో రైతులను ప్రభుత్వం వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కథ చెప్పినట్లు ఉందని… చిల్లర మల్లర స్పీచ్‌లా ఉందే తప్ప బడ్జెట్‌ ప్రసంగంలా లేదని అన్నారు.

ANN TOP 10