AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శామీర్‌పేటలో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్‌పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంతో వచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పింది. అనంతరం ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అతివేగమే ప్రమాద కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు సైతం కారు వేగంగా వెళ్లిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఇన్నోవా కారు..అతి వేగంతో అదుపుతప్పి డివైడైర్ ను ఢీకొట్టింది. వేగానికి డివైడైర్ అవతలి వైపు వెళ్లి ఆ రోడ్డున బోల్తా పడింది. ఈ సమయంలో ఓ బస్సు వస్తుండగా..డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దీంతో ఆ బస్సు.. కారును ఢీకొట్టకుండా చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ANN TOP 10