(అమ్మన్యూస్, హైదరాబాద్):
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్లు ఇచ్చి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రెండు జాతీయ పార్టీల ఎంపీలను ఇక్కడి నుంచి గెలిపిస్తే ఒక్క పైసా తేలేకపోయారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌పై కాంగ్రెస్, బీజేపీలను సభలో నిలదీస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చి ఆరు గ్యారంటీలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, ఎక్కడ చేశారని ప్రశ్నించారు. సిగ్గులేకుండా పేపర్లలో యాడ్ ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు చెరో ఎనిమిది సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకురాలేకపోయాయని ఆగ్రహం వ్యక్తచేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నిధులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టింది, అయినా స్వశక్తితో తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి పదేళ్ల నుంచి ఒక్క పైసా ఇవ్వడం లేదని చెప్పారు.
సీఎం రేవంత్ కొత్త నాటకం షురూ..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక వాగ్దానలు చేశారని అన్నారు. బడ్జెట్‌కు ముందు 18 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి.. బీజేపీ కేంద్ర మంత్రులను కలిశారని, అయినా రాష్ట్రానికి ఒక్కపైసా రాబట్టలేకపోయారని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటూ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలను ఎదుర్కోవడం బీఆర్‌ఎస్‌కు కొత్త కాదని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ హక్కులు కోసం మాట్లాడారు, మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హక్కుల కోసం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.