(అమ్మన్యూస్, హైదరాబాద్):
ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న దాశరథి ప్రజాసాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ భీమపాక ఈ పురస్కారాన్ని అందజేసి శాలువ, జ్ఞాపికతో ఆయనను సత్కరించారు. చింతలకుంటలోని వాసవీ శ్రీనిలయం వేదికగా ‘మాభూమి సాహితీ సాంస్కృతిక వేదిక’ ఆధ్వర్యంలో దాశరథి శత జయంత్యుత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ నగేశ్ మాట్లాడుతూ.. దాశరథి అన్నట్టు గాయపడిన ఆ కవి గుండెల్లో రాయబడని కావ్యాలన్నీ గోరటి వెంకన్న రాయాలని ఆకాంక్షించారు. దాశరథి, వెంకన్న.. ఇద్దరూ పీడితుల పక్షాన నిలిచిన కవులంటూ వారిని ప్రజా కవులుగా అభివర్ణించారు. ఈ పురస్కారాన్ని అందుకోవడం తనకు ఆనందంగా ఉందని గోరటి వెంకన్న అన్నారు.
తెలంగాణలో ఎంతోమంది గొప్ప కవులు, రచయితలు, కళాకారులకు పుట్టారని, వారంతా తన పాటకు స్ఫూర్తి అని వెల్లడించారు. ‘సంతా… మా ఊరి సంత…’ పాట ఆలపించి సభను గోరటి వెంకన్న ఉర్రూతలూగించారు. ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా అందిస్తామని కార్యక్రమ నిర్వాహకుడు గొర్రెపాటి నరసింహ ప్రసాద్ చెప్పారు. కార్యక్రమానికి హాజరైన హైదరాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తులు కె. మురళీమోహన్, ఎం వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్, రచయిత కూనపరాజు కుమార్ తదితరులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో దాశరథి స్థానం ప్రత్యేకమైనదంటూ కొనియాడారు. ప్రజాక్షేత్రంలో నిలిచి సాహిత్య సృజన చేసిన ఘనత ఆయన సొంతమని శ్లాఘించారు.