హైదరాబాద్ పాతబస్తీలో ఘరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లోని ఓ సోఫా తయారీ గోదాంలో ఇవాళ తెల్లవారుజామునఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మూడుంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో సోఫా తయారీ గోదాం ఉంది. ముందుగా సోఫా తయారీ గోదాంలో అంటుకున్న మంటలు చాలా వేంగా మెుదటి అంతస్తుకు వ్యాపించాయి. మెుదటి అంతస్తులో గోదాం నిర్వహిస్తున్న శ్రీనివాస్ కుటుంబం నివాసం ఉంటుంది.
వారి ఇంట్లోనూ సోఫా తయారీ వస్తువులు ఉండటంతో వేగంగా మంటలు వ్యాపించాయి. శ్రీనివాస్‌తో పాటు అతని భార్య నాగమణి, ఇద్దరు కుమార్తెలు హరిణి, శివ ప్రియ బయటకు రాలేక అందులోనే ఇరుక్కుపోయారు. స్థానికులు అక్కడకు చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రెండు గంటలు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. రెండు, మూడో ఫ్లో్ర్‌లో దాదాపు 20 మంది ఉండగా.. వారిని సురక్షితంగా బయటకు తీశారు. పెద్ద పెద్ద నిచ్చెనలు, స్థానిక యువత సాయంతో వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అయితే మెదటి అంతస్తులో ఉన్న శ్రీనివాస్ కుటుంబంలో అందరికీ గాయాలు కాగా.. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. వీరిలో శివ ప్రియ (10) పరిస్థతి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.