కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. ఇదివరకు సార్వత్రిక ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్‌ను సభ ముందు ఉంచారు. ఇప్పుడు ఇది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా ఆమెకు ఇది ఏడవది.
ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్‌ను సభకు సమర్పించారు. ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం.. భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 272 కాగా.. 292 మంది సభ్యుల బొటాబొటి మెజారిటీ ఉంది ఎన్డీఏకు. ఇందులో కూడా రెండు పార్టీలే కీలకంగా వ్యవహరిస్తోన్నాయి. ఆ రెండూ తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్). ఈ రెండింటికీ కలిపి 28 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో- టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ఈ వార్షిక బడ్జెట్‌లో భారీగా వరాలను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ను సంతృప్తి పరిచేలా ఆర్థిక చేయూతలను ప్రకటించింది. ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి పర్చడానికి 15,000 కోట్ల రూపాయలను ఇస్తామని ప్రకటించారు నిర్మల సీతారామన్. ఏపీలో వెనుకబడిన మూడు జిల్లాల అభిృద్ధికి ప్రత్యేకంగా గ్రాంట్‌ను మంజూరు చేస్తామనీ అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు.
ఏపీ, బిహార్‌కు భారీగా నిధులను ప్రకటించడ పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దేశ ప్రజల ప్రయోజనాల కంటే కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే కేంద్ర బడ్జెట్‌లో ఈ రెండు రాష్ట్రాలకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, సంతుష్టీకర రాజకీయాలకు తెర తీసిందంటూ భగ్గుమంటోన్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఏపీ, బిహార్‌కు అధిక నిధులు ఇవ్వాల్సి ఉంటుందనే ప్రాతిపదకన ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు కనిపిస్తోందని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు, ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికి అదే కారణమని చెప్పారు. బీజేపీ బడ్జెట్‌పై స్టార్ హీరో సెటైర్లు ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రానికి బడ్జెట్‌లో కేంద్రం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిందని ధ్వజమెత్తారు. 10 సంవత్సరాల మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం భారీగా పెరిగిందని, దాన్ని ఎలా తగ్గిస్తారనేది బడ్జెట్‌లో పొందుపర్చలేదని చెప్పారు. ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్న తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఏమిచ్చారని నిలదీశారు.