భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ఎట్టకేలకు తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవం తర్వాత కేసీఆర్.. సమావేశాలకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన కాలుకు సర్జరీ కావడంతో.. అసెంబ్లీ సమావేశాల సమయంలో కాకుండా ఆ తర్వాత స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ప్రమాణం చేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ సభా సమావేశాలకు హాజరు కానుండటం తీవ్ర ఆసక్తికరంగా మారింది. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారని గులాబీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే గురువారం రోజున సభకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రతిపక్ష నేతగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు అయినట్లు అవుతుంది. ఇక ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు.
ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇప్పటికే బీఆర్ఎస్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీ, ఫీజు బకాయిల జమ సహా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని అంశాలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఇవే అంశాలను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసేందుకు గులాబీ ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నారు.