AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐఏఎస్‌ కొట్టాలంటే.. అందెగత్తెలు కావాలా?.. స్మిత సబర్వాల్‌ వైఖరిపై బాల లత భగ్గు

– దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలా?
– తక్షణం కేసీఆర్, కేటీఆర్‌ స్పందించాలని డిమాండ్‌
– సర్వత్రా వెల్లువెత్తుతున్న ఆగ్రహజ్వాలలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌ వాఖ్యలపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దివ్యాంగులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పలువురు మండిపడుతున్నారు. ‘వికలాంగులపై స్మితా సబర్వాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఐఏఎస్‌ కొట్టాలంటే అందెగత్తెలు కావాలా?.. ఈ విషయంపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ తక్షణం స్పందించాలి’ అని సివిల్స్‌ ఎగ్జామ్‌ కోచ్‌ బాల లత మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వికలాంగులు ఉండాలా?.. వద్దా? చెప్పండి అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చిన విషయం మరిచిపోవద్దన్నారు. స్మిత వ్యాఖలకి సీఎం రేవంత్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్‌ కూడా తక్షణమే స్పందించాలని అన్నారు. మా మీద ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణం రాజీనామా చేయాలి
స్మిత సబర్వాల్‌ వెంటనే రిజైన్‌ చేయాలి.. మాకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్‌ చేశారు. స్మిత సబర్వాల్‌ జస్ట్‌ ఒక ఐఏఎస్‌. ఇదే నా ఓపెన్‌ ఛాలెంజ్‌.. ఇద్దరికీ (నాకు, స్మితకి) సివిల్స్‌ ఎగ్జామ్స్‌ పెట్టండి.. ఎవరికి ఎక్కువ మార్క్స్‌ వస్తాయో చూద్దాం అంటూ బాల లత అన్నారు. స్మితా సబర్వాల్‌ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి కింద నిబంధనల ఉలంఘనకు పాల్పడ్డారు. రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను ఈమె వ్యతిరేకిస్తున్నారా? ప్రీమియర్‌ సర్వీసెస్‌ అంటే ఈమె ఉద్దేశ్యంలో ఏమిటి? ప్రజాసేవకులా?, ప్రజల మీద పెత్తనం చేసేవారా? అంటూ బాల లత ప్రశ్నించారు.

బహిరంగ క్షమాపణలు చెప్పాలి..
దివ్యాంగులు ఎక్కువ సేపు పనిచేయలేరని, వారి సమర్థతను నిర్ణయించడానికి, శంఖించడానికి స్మిత సబర్వాల్‌ కు గల శాస్త్రీయ ప్రాతిపదికలు ఏమిటని లత ప్రశ్నించారు. దివ్యాంగుల పట్ల సానుభూతి లేని స్మిత వాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని లత డిమాండ్‌ చేశారు.

ఇంతకీ స్మితా ఏమన్నారంటే..
ఇటీవల ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ ఉదంతం నేపథ్యంలో స్మితా సబర్వాల్‌ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. యూపీఎస్సీ చర్చ విస్తృతమవుతోన్న నేపథ్యంలో తాను దివ్యాంగులను గౌరవిస్తున్నాను అంటూనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు వికలాంగుల కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నాను అంటూ రాసుకొచ్చారు. దీంతో స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యాలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10