AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైఎస్ జగన్, రఘురామ మధ్య సంభాషణ.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు ఆసక్తికర సన్నివేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారన్న అంశంపై సర్వత్రా అందరిలో ఆసక్తి కనిపించింది. అయితే ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని వైఎస్ జగన్ జగన్‌ను రఘురామ కోరారట.. సమావేశాలకు హాజరవుతానని జగన్‌ బదులిచ్చినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ లాబీల్లో ఈ సీన్ కనిపించింది.. జగన్ లాబీల్లో వెళుతుండగా రఘురామ చొరవ తీసుకుని పలకరించారు. ప్రతిరోజు అసెంబ్లీకి రండి.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారట. అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. చూస్తారుగా అంటూ జగన్ బదులిచ్చారట. తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ను రఘురామ కోరారట.. తప్పని సరిగా అంటూ కేశవ్ నవ్వకుంటూ వెళ్లిపోయారట. అలాగే రఘురామను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలకరించారట.

రఘురామ గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్నారు.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున నరసాపురం నుంచి పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికి రఘురామ అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అప్పటి ప్రభుత్వం, జగన్‌ తీరుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత రఘురామ అరెస్ట్‌ వంటి పరిణామాలు జరగడంతో.. ఆ పార్టీకి దూరమయ్యాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు రఘురామ టీడీపీలో చేరగా.. ఉండి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తనను కస్టోడియల్ టార్చర్ చేశారంటూ ఇటీవల రఘురామ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, సహా మరికొందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 2021 మే 14న తనను రాజ ద్రోహం కేసులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారని.. రాత్రంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆయన ఫిర్యాదుతో గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10