AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంతా సమృద్ధే.. వర్షాలు, పాడి, పంటలకు లోటు ఉండదు.. ‘రంగం’లో స్వర్ణలత భవిష్యవాణి

భక్తుల కోరికలన్నీ తీరుస్తా..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాల జాతరలో రెండో రోజైన సోమవారం ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి ఆలయంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చికుండపై భవిష్యవాణి చెప్పారు. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్నారు. పాడి, పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు. తనకు మట్టి బోనాలు, స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు.

ఏమిచ్చినా ఆనందంగా స్వీకరిస్తా..
ప్రజలపై తన దీవెనలు ఉంటాయని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ప్రజలను కాపాడేది తానే అని చెప్పారు. తనకు ఏమిచ్చిన ఆనందంగా అందుకుంటానని అన్నారు. పిల్లాజెల్లా, గొడ్డుగోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు. ఈ ఏడాది ఐదు వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్తును అమ్మవారు కోరారు. ఔషధాలు తగ్గించుకొని పాడి పంటలపై దృష్టిపెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం వైభవంగా జరిగింది. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల వీరంగంతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. ఆడపడుచులు బోనాలు, సాక సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు.

ANN TOP 10