AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా అధ్యక్ష రేస్ నుంచి జో బైడెన్ ఔట్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ సంచలనం పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని తెలిపారు. అధ్యక్షుడిగా తాను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు. కొద్ది రోజులుగా జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది. దీనికి తోడు ఆయన ఇటీవల కరోనావైరస్ బారినపడ్డారు. వృద్ధాప్య సమస్యలు కూడా తోడయ్యాయి.

ఈ నేపథ్యంలో జో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసులోనుంచి వైదొలగడం గమనార్హం. జో బైడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కమలా హారీస్ ముందు వరుసలో ఉన్నప్పటికీ.. మరెవరైనా అభ్యర్థిని ఖరారు చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా కూడా బరిలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ విజయావకాశాలు మెరుగయ్యాయంటూ సర్వేలు చెబుతున్నాయి. జో బైడెన్ వ్యవహారశైలి కూడా ట్రంప్‌కు అనుకూలంగా మారింది. ట్రంప్‌తో ఆయన పోటీ పడలేకపోతున్నారు. ఇటీవల జో బైడెన్ తన భార్య అనుకుని మరో మహిళను ముద్దు పెట్టుకునేందుకు సిద్దమైన వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలు కీలక సమావేశాల్లోనూ జో బైడెన్ అంటిముట్టన్నట్లుగా, ప్రసంగాల్లోనూ పొరపాట్లు చేయడంతో ఆయనను డెమోక్రటిక్ పార్టీ నేతలు తప్పుకోవాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10