రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని సమీక్షించారు. జిల్లాల్లోని అధికార యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నం కావాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు గోదావరి ఉధృతి వల్ల అక్కడి పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా రెస్కూటీమ్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వినియోగించాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఉన్నతాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఏ విధమైన సహాయం కోసమైనా ఏ సమయంలోనైనా రాష్ట్ర రాజధానిని సంప్రదించవచ్చన్నారు. ముఖ్యంగా గోదావరి ఉధృతిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు.