ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం
ప్రత్యేక పూజలు.. పట్టు వస్త్రాల సమర్పణ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీస్సులు ఇచ్చి.. తీర్థప్రసాదాలను అందజేశారు. తొలుత సీఎంకు ఆలయ పండితులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.
పొన్నం కుటుంబ సమేతంగా..
మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పొన్నం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..
ఉదయం నుంచి అమ్మవారికి ప్రముఖులు, భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి.. మొక్కులను చెల్లించుకునేందుకు బారులు తీరారు. పిల్లలు, పెద్దలు అంతా అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
గురుపూర్ణిమ కలిసి రావడంతో..
బోనాల పండుగకు తోడు.. గురుపూర్ణిమ కూడా కలిసి రావడంతో ఊరు, వాడ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఓ వైపు గ్రామ దేవతల ఆలయాలు, మరోవైపు గురువుగా భావించే సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.